Tuesday, January 27, 2009

నా..


తొలిపొద్దు వేకువ జామున..
సూర్యుడి వెండి కాంతులు..
నా మేనిని తాకుతూ..చెప్పేను శుభోదయం
పక్షుల కిల కిల రావాలు..
నా చెవి మీటుతూ..పలకరించే ఈ ఉదయం
బుడి బుడి బుజ్జాయి అడుగుల సవ్వడి..
ప్రతి రోజు..చెప్పేను నాకు నవోదయం !!

సాగే ప్రతి రోజున..
కారులో వినిపించే సంగీతం..
చల్లగా తాకే పిల్ల గాలి..
కనిపిస్తే నవ్వుతూ పలకరించే జనాలు..
కాఫీ ఘుమ ఘుమలు..
మనతో పని చేసే వారి విమర్శలు..
తెలిసిన వాళ్ళతో పేచీలు..
తెలియని వాళ్ళతో పరిచయాలు..
ఇలా ఒక్కో అనుభవం ఒక్కో అలలా..
మనసు తీరాన్ని తాకుతూ వెళుతుంటే..
పరిగెత్తే ఆ గడియారం ముల్లులా..
రోజు గడిచిపోతుంది !!

ఏదో వండాల వద్దా అనే వంటతో..
బుజ్జాయి చిన్న చిన్న ఆటలతో..
ఎప్పుడు వస్తూందా అని వేచి చూసే ఆ సాయంత్రం..
వెలిగే ఆ కొవ్వొత్తులా కరిగిపోతూంది !!

మెల్లిగా నడుం జార్చుతూ..
ఆ వెన్నెల సోయగాలని ఆశ్వాదించాలని
ప్రతి రోజు ఆ కిటికీ లోంచి తొంగి చూస్తే..
వెన్నెల కాంతిని కప్పివేసే ప్రపంచ వెలుగు
విమానాలే నక్షత్రాలు..
పొగ వాహనాలే కీచురాళ్ళ శబ్దాలు..
వీటినే నాకు నచ్చిన .. నా మది మెచ్చిన..
ఊహలతో కలల లోకం లోకి జారుకుంటాను !!

ఇలా జీవితంలో ఉన్న నవరశభరితాలన్నీ..
ప్రతి రోజు బ్రతుకు పుస్తకంలో ఒక్కో పేజీలా జతపరుస్తూ..
తీరిక సమయాన ఆ పేజీలే జ్ఞాపకాలుగా..
మరల తిరిగి చదవడానికి ఇండెక్సు జోడిస్తూ..
ఇలా ఇలా సాగుతూంది నా జీవితం..
లేదు అనే నిన్నతో కాదు..
ఉన్నా కూడా లేని నేడుతో కాదు..
ఉంది అనే రేపుతో...!!