Monday, July 10, 2006

చూపులు..


నీ చూపుల చురకత్తులు
ఈ హృదయాన్నిచీలిస్తే
గాయం కాలేదు సరి కదా
గేయం స్రవించింది !

Wednesday, July 05, 2006

కోరిక..


ప్రతి రోజు సూర్యుడు నవ్వుతూ నీకు శుభోదయం చెప్పాలని
ప్రతి రేయి చందమామ చల్లని కబుర్లతో కలల లోకంలో నిన్ను తిప్పాలని
ప్రతి తారక నీ ఎదుగుబాటలో ఒక మెట్టుగా నిలవాలని
ప్రతి పదం నీ కవితా వెల్లువలో ఓ మణిపూసగా జతవడి మిగిలిపోవాలని
నా ప్రతి సంతోషంలో నీ సంతోషం దాగి ఉండాలని
నా ప్రతి చిరునవ్వుకి అందం నువ్వే కావాలని
నా జీవిత పయనంలో ఏనాడు విడిపోని నేస్తంలా
ఒక మనసున్న బాటసారిలా నాతో కలిసి పయనించాలని నా ఆశ.. నా కోరిక !

మరుపురాని మరువలేని.. మదుర ఘట్టం కావాలి మన స్నేహం
మనిద్దరి జతలో గడిచిన ప్రతిక్షణం ఓ ప్రబంధం అవ్వాలి అని కోరికతో

సారిక !

Friday, June 23, 2006

ఎదురుచూపు..


మాటల కొటలలో నిన్నే మైమరిపించి
చేతల నాట్యం లో నిన్నే సవరించి
మదురమైన వేలలో కనులని ముద్దాడి
కలవరపడి కనులు తెరవగా సమయం సందించింది
నీ ఊహ నా మదిని భందించింది
మరల కనులు మూయగా రాత్రి నవ్వి పగలుతో చేయి కలిపింది
నా చేరువైన ఆనందాన్ని మరల తన చీకటిలో దాచేసుకుంది
మళ్ళీ రాత్రి కోసం నా మది వేయి కన్నులతో ఎదురుచూస్తుంది.. !

Tuesday, June 20, 2006

ఓ స్పందన..


పడమటి వర్షం
ఆకాశం గొంతులో పల్లవిస్తుంటే
పరవశపు హర్షం
గుండె గొంతును తడుతుంది !

Monday, June 12, 2006

ముద్దు..


తనువు కోరిన మోహానికి
తనివి తీరని దాహానికి
పెదవులు కర్తలై మదించగా
మధుర సుధ చిందిన వేలా
ఓ చెలి... తొలిముద్దు మధురిమలు
నుదిటిపై బిందువులాయెనే
ఈ కవితకి పదములాయెనే !

Wednesday, May 31, 2006

భావాలు..


స్నేహం లోని తియ్యదనం
ప్రేమ లోని కమ్మదనం
విరహం లోని పిచ్చిదనం
ఎదురు చూపులోని సహనం
అరహరం అదే మననం
ఇవికేవలం భావాలు ఒకప్పుడు
నీ వల్ల అనుభావాలు ఇప్పుడు !

Thursday, May 25, 2006

చేమంతి..


నీ కౌగిల జడిలో...
నీ ముద్దుల సడిలో...
కునుకైన రాలేదే ఓ చేమంతి...
కలో నిజమో తెలియని ఆ అనుభూతి...

కనులు మూసుకున్నా చెలి ఓ పారవష్యంలో...
నిన్ను వెతుకుతున్నా మనసుతో ఆ పయనంలో...

జిలుగుల తారాకలు నీ జాడ చెప్పగా...
నే పంపిన చిరుగాలి ఆనవాలు చూపగా...
ఒదిగిన ముత్యమల్లే... పాలరాతిశిల్పమల్లే...
పవలించిన నిన్ను కనులార గాంచితినే...
నీ నగుమొము వదనాన్ని మదిలో దాచితినే...

ఎగసిన అనందం హృదయ వాడి ని పెంచ...
పెరిగిన వడి సవ్వడిని మరింత హెచ్చించ...
నీ నిదుర చెడుతుందేమొనని తలచి...
మరోసారి నిన్ను మనసార పరికించి...
సుకుమార నుదిటిని సుతారంగా ముద్దిడి...

వెనక్కి వచ్చాను.. ఊహకి సంకెల్లు వేసాను...
కనులు తెరిచి నీ ఊహా రూపాన్ని తిలకిస్తు మల్లి పారవస్యం లో....

ఇలా కునుకైన రాలేదే ఒ చేమంతి....
కలో నిజమో తెలియని ఆ అనుభూతి...

Saturday, May 13, 2006

Mother's Day..


అమృతానికి అర్పనకే అసలు పేరు అమ్మ
అనుభూతికి ఆద్రతకే ఆలవాలం అమ్మ

ప్రతి మనిషికి పుట్టుకకు పట్టు గొమ్మ అమ్మ
ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ !

--- శ్రీ మడుగుల నాగఫణి శర్మ గారు

Friday, April 07, 2006

పిచ్చి ప్రేమ..


నీకు తెలుసా రాత్రి కౌగిలిలో
ప్రపంచం నిద్రిస్తోంటే
హఠాత్తుగా గుర్తుకువస్తావు!
మెలుకువ వస్తుంది!
నా పిచ్చిగాని నిన్ను విడిచి
ఈ మనసెప్పుడు నిద్ర పోయిందని
నీ జ్ఞాపకం వెండి వెన్నెల గుండెల్లో వర్షిస్తే
నా ప్రమేయం లేకుండానే విరుస్తుందో నవ్వు!!
ఓ భావం ఎదలో మెదిలి పైకి చెప్పనూలేక
లోలోన ఇమడనూలేక
సతమతమౌతున్న అంతర్మథనం !
అనుక్షణం ఓడిపొతూనే ఉన్నా చిత్రంగా!
నాకెప్పటికీ అసలెప్పటికీ అర్థం కాదేమో
నువ్వంటే నా కెందుకో ఇంత పిచ్చి ప్రేమ!!

Monday, March 20, 2006

అలుక..


జాబిలిని చూస్తున్నా.. రేయి గడిచినా ఇంకా విహరిస్తున్నా...
ఇంకా రావెంటి అంటు విసుగ్గా నిద్రా దేవి పిలుపు...
ఎక్కడో దూరాన కాని ఉన్నామని నన్ను రమ్మని జాడ చెప్తున్న తారలు...
మరి ప్రశాంతత ఎక్కువైతే బాగోదని స్వరం పెంచిన కీచురాల రొద...
కొత్త పెల్లికూతురులా బిడియం తో వెల్లఆల వద్ద అన్నట్టు గా రాలుతున్న చినుకులు...
అయిన అన్నిటికి దూరంగా ఒంటరిగా అలోచనలో మునిగిపొయింది నా మనసు...
ఇంత అందమైన ప్రకృతిని ఎలా వర్ణించాలో అన్న తపన కాదులే దానిది...
ఒక చిన్న కోరిక మాత్రమే.. చిన్నబుచ్చుకున్న నేస్తాన్ని ఎలా వేడుకోవాలి...
మనవి ఆలకించి అనుగ్రహించవా... ఆగ్రహించక అలుక మానవా ఓ నా ప్రియ నేస్తమా !!

Thursday, March 16, 2006

నాతోనే వుండలేవా?


సంద్రాని కి అలలా...
ముంగిట్లో రంగ వల్లిలా...
గగనానికి హరి విల్లులా...
స్వాతి చినుకుకి ముత్యపు చిప్పలా...
చంద్రునికి వెన్నెలలా...
పూవులకి సుగందంలా...
మేఘానికి వర్షంలా...
రవికి కిరణంలా...
ఎల్లప్పుడు...నాతోనే వుండలేవా?

Wednesday, March 15, 2006

జాబిలి..


మెత్తని చీర కట్టి.
కల్లకి కాటుక పెట్టి ..
కురులలో మల్లెలు పెట్టి
ప్రక్రుతి లా వచ్చింది
ఎన్నో ఊసులు చెప్పింది
ఎన్నో ఆటలు ఆడింది
ఇదంతా చూసి
జాబిలికి సిగ్గేసి మబ్బుల చాటున దాక్కుంది !

Tuesday, February 14, 2006

నీ నేను..


నా భావం
నా భాష్యం
నా హాస్యం
నా లాస్యం
ఆన్ని నీ సొంతం...
నువ్వు కాని నువ్వు నా నువ్వు
అసాంతం నా సొంతం
-- నీ నేను

Wednesday, February 08, 2006

భావాలు..


భాషకందని భావాలెన్నో
మదిలో అక్షరరూపం దాల్చమంటే
మొరాయిస్తున్నాయి..

ఊహకందని ఆశలెన్నో
మదిలో ఊహల్నుండి వాస్తవానికి
రానంటున్నాయి..

ఎలా నా భావాలు ఆశలు నీ ముందుంచటం !!

Thursday, February 02, 2006

వనమాలి..


గాలికి రాలిన ఆకుల్ని సహితం
ప్రేమగా సృచించే ఓ తోటమాలి
వాడిన పూలపై నీకెందుకోయి జాలి..

మొగ్గగానే మొక్కనుండి దూరమై
వెలుగుచూడని ఈ వికసించని పూలపై
నీ కెందుకోయి జాలి ..

పూలు కోసేవారికి లేని జాలి
చెట్లు నరికే వారికి లేని జాలి
మాపై నీ కెందుకోయి వనమాలి !!

Wednesday, January 18, 2006

కలలు...


నా కలలు సంద్రం లో అలలు
నిజమయ్యెందుకు విరిసిన నా కల తపిస్తుంది
తీరం చేరలని ఎగిసిన ప్రతి అల ప్రయత్నిస్తుంది
కాలేని నా కల కనుమరుగవుతుంది..
చేరలేని అల సాగరంలో కలిసిపోతుంది
అయినా భాధ పడవు..విశ్వాసాన్ని వీడవు
మల్లి కొత్త రంగులు పులుముకుని వస్తాయి నా కలలు
మరింత వేగంతో ఎగబడతాయి అలసిపోని ఆ అలలు
అందుకే నా కలలు సంద్రం లో అలలు !!

Monday, January 16, 2006

యత్నం..


అనుకున్నది సాధించాలని ఆశిస్తే సరిపోతుందా ?
అడుగైనా కదపకపోతే ఆకాశం అందేస్తుందా ??

ఉలి దెబ్బలు తొలచకపోతే శిల చక్కని బొమ్మౌతుందా ?
పలుగు నేల తగలకపోతే పంట వెలుగు మనదౌతుందా ??

వేలి కొసలు మీటకపోతే వీణపాట వినిపిస్తుందా ?
వేల శృతులు కలవకపోతే బృందావనమనిపిస్తుందా ??

యోచనకే పరిమితమైతే ఆశించిన గమ్యం దొరకదు !
ఆచరణే కరువై పోతే ఆశయాలకర్ధం మిగలదు !!

Wednesday, January 11, 2006

నీ రాకకై ...


గడ్డిపూల గుంపుల అంచున మెరిసేటి
ఓ మంచి ముత్యమా జారిపోకుమా...!
అలసి సొలసి నా సఖుడొస్తే
పాదాలు కడుగను నీవు కావాలి సుమా...!!

గుడ్డిదీపపు చిన్న వెలుగున
కనిపించు ఓ కాంతి కిరణమా ఆరిపోకుమా...!
యే నిశి రాత్రో నా ప్రియుడొస్తే
దారి చూపను నీవుండాలమ్మా..!!

మసక బారిన నా కన్నుల
నిలిచిన ఓ జీవమా నన్నిడిచిపోకుమా...!
నా కై నా ప్రాణనాధుడొస్తే
అతని పాదాల చెంత విడువడానికై కాస్సేపు ఆగమ్మా...!

Monday, January 09, 2006

ఓ స్వప్నమా...


ఊహల అంచున
ఆశల అందలంలో
తొణికిసలాడుతున్న స్వప్నమా
నిజమై నాకు కనిపించు
దరిదాపున కనిపిస్తూ
అంతలో మాయమై దూరమయ్యే
ఎండమావిలా మారకుమా
ఓ స్వప్నమా ! ఓ స్వప్నమా !

నీ అరుణవర్ణం నాలో ఆశలు రేపే సువర్ణం
సిరులతో కాన లేని నీ హిమపాతంలో
నాకే సొంతముగా కరుణించుమా
ఓ స్వప్నమా ! ఓ స్వప్నమా !

Thursday, January 05, 2006

తృప్తి


కోరికల కొండల ఆవల
నింగి నేల కలిసే అంచున
అందంగా నిలబడి ఉన్న తృప్తిని చూసి
అందుకుందామని వెర్రి అశలతో పరుగెడితే
ఎన్ని కొండలు దాటినా
తృప్తికి, నాకూ మధ్య దూరం తరగడం లేదు
అలిసి, విసిగి వెనుదిరిగిన నేను
ఒక్కమారు నాలోకి తొంగి చూసాను చిత్రం !
అది నాలోనే నిండుగా ఉంది !!